Tuesday 2 April 2024

పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

శ్రితజన బాంధవాళిని విశిష్ట తపోధన మౌని సంఘమున్ 

జిత వివిధానురాగమయ జీవిత చోదక సాధకాళినిన్ 

సతతము రక్షజేసెడి ప్రశస్తిని గాంచుచు దుష్ట దైత్య భూ

పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

Thursday 16 March 2023

నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!!

అవధానివారి దారిలోనే.........


క్షేమమొసంగునట్టిదగు శ్రేష్ఠకవిత్వ పదార్థజాలముల్ 

నీమముతోడ భక్తిమెయి నేర్పు రహించెడు ధోరణాకృతిన్ 

కామిత సత్ప్రదాయినిగ కావ్యములన్ విరచించి యాదిఁ శ్రీ

నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!!

 

Wednesday 15 March 2023

ఆముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్

 శతావధానములో ఆముదాల వారియొక్క ప్రతిభతో సభికులకు మోదము ( ముదము ) గల్గినదని .......... 


ధీమహితాత్ముఁడై చెలఁగి దీర్ఘకవిత్వ పరంపరక్రియా

స్తోమ మహాహవాద్భుత యశోవిభవాత్ముఁడు నాముదాల వి

ద్యామహిమాన్వితుండునయి ధారణ ధారల తేలియాడుచో 

నా ముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్


Sunday 5 March 2023

లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె ? సద్వధానిగన్

 శ్రీ ఆముదాల మురళి యవధానులవారికి నమస్సులతో.......... 

(తప్పులుంటే క్షమించమని )


అక్కట! యాంధ్రదేశ నివహంబుననా కుకవి క్రమంబునన్ 

లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె ? సద్వధానిగన్

మక్కువ జూపి సత్కవన మాధురులన్ పచరింపజేసి పెం

పెక్కిన ధారణాపటిమనెన్నగ మిన్నగ నున్నవారహో !


Saturday 4 March 2023

హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్.

 సూర్యాస్తమయములోపల సైంధవుని చంపుతానని ప్రతిన బూనిన అర్జునుని గెలిపించుటకై శ్రీకృష్నుడు సూర్యుని కిరణములను తన చక్రముచే గప్పుట..........


పరిణతి వీడి కౌరవులు పాండవమధ్యమపుత్రునంత సం

గరమున ధర్మదూరులయి కర్కశరీతిని సంహరించ భీ 

కరగతి సైంధవున్ దునుమగా ప్రతినంబిడెనర్జునుండిదో

హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్


Friday 3 March 2023

బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో

 అర్జునుడి ప్రతాపము..........


వింత నకప్రయోగముల భీకర యుద్ధధురంధరుండునా

సాంతము వైరిరాజుల ప్రచండతరోగ్ర శిరోవిఖండితా

పంతము బూని విస్తృతవివర్ధిత దీర్ఘ శలాక జాలమౌ

బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో


Thursday 2 March 2023

కాకుల్ గర్జన సేయఁగా శునకముల్ గాండ్రించె నుగ్రమ్ముగన్

 సకల ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు సంధికొఱకై కౌరవ సభకేగిన - దుష్ట చతుష్టయము స్వామిని గేలిచేయు సందర్భము........


సాకల్యంబుగ సంధి కోరిన నిరాశా తాడితోన్మాదులై 

ప్రాకట్యంబగు ధర్మ దిగ్విజయ సంభావ్యంబు ద్వేషించుచున్ 

శ్రీకృష్ణున్ సకలాఘ శోషణుని వంచింపంగ ధూషించిరే

కాకుల్ గర్జన సేయఁగా శునకముల్ గాండ్రించె నుగ్రమ్ముగన్