Saturday, 7 September 2013

ఈ మాత్సర్యవిషంబు గ్రోలితిని నిన్నే నమ్మితీనాడు కృ 
ష్ణా మాయామయ సారహీన మగు సంసారాంబుధిన్ గ్రుంకితిన్ 
క్షేమంబిచ్చెడి నీదునామమును విశ్లేషింపనైతిన్ గదా
శ్యమా! నీకరుణామృతంబు నిడుమా సత్కార్య లీలాకృతా!   

Wednesday, 4 September 2013

నీ నామంబెడబాయకన్ దలఁతు నే నిత్యంబు సద్భక్తితో
మీనంబై ప్రళయాంతకాలమున భూమీప్రాంత సంరక్షకుం
డైనావయ్య, సమస్తవేదముల నీవైనిల్చినావయ్య ల
క్ష్మీనాథా! మముఁగావవయ్య దయతో శ్రీ చిద్విలాసప్రభో! 

Sunday, 1 September 2013

గీతన్ జెప్పితివీవు యుద్ధమున సంగీతమ్ముగా మాకు, మా
రాతల్ మర్చి పవిత్ర కర్మచయసంప్రాప్తిన్ ప్రసాదించుమీ
చేతల్ నీవి ఫలంబు నీది యిక మా చిత్తంబు నీవౌదువే 
నాతాపత్రయముల్ హరించుము జగన్నాథా ప్రణామంబిదే.  

Friday, 30 August 2013

కన్నా! వేడెద నిన్ను నీదు కరుణా కౌక్షేయకంబిచ్చి మా
దన్నున్ చూపగ చేయుమయ్య నిక విద్వన్మూర్తినీవౌట, మా
కెన్నన్ లేరిక దిక్కు నీవెకద సంక్లిష్టంబునన్ గావగా, 
వెన్నున్ జూచిన వెన్నుజూపరిక సంవిత్తంపుసంసారమున్. 

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ:

బాలుండయ్యు నమానుషత్వబలమన్ ప్రఖ్యాత దైత్యేయులన్
కాలన్ రాసితివీవు నాడు, దయతో, కాలుష్య సంస్కారుడై
వేలన్ వేలుగ దైత్యకర్మచయ సంవేష్టుండునై యుంటి నీ
లీలన్ జూపి విముక్తినీయగలదే, లీలావినోదప్రియా! 

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ:

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ:

నీపాదాబ్జములన్ స్మరించెదను మున్నీరంపుసంసార భీ 

తాపారంబును దాటవేయుము జగద్రక్షైకపారాయణా!
శాపగ్రస్త విముక్త మార్గమిక నిస్సంకోచమౌ రీతి నీ 
చూపేయంచిక నమ్మినాడ నిను సంస్తుంత్యంబు జేతున్ సదా.  

Wednesday, 28 August 2013

శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు





గురువులు శ్రీకంది శంకరయ్య గారికి, శ్రీ నేమాని పండితవర్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. 

శ్రీ కృష్ణా మము గావుమయ్య దయతో శ్రీచిద్విలాసప్రభో!
మాకృత్యంబులకండనిల్చి జగతీ మాధుర్యమున్ జూపి చి 
త్తైకాగ్రంబున నిల్వగోరెదను మోక్షేచ్చా ప్రవృత్తిన్ సదా
నీకృత్యంబుల పాడి వేడెదను నిన్ నే గొల్చెదన్ నిత్యమున్.