Sunday, 6 November 2016

సరిలేని శస్త్రాస్త్ర చాపయుద్ధోద్ధతిన్
.......... ఋషియజ్ఞమును గాచె రిపులజంపి
కఠినశాపమున నిర్గమనయైన యహల్య
.......... కును నిజరూపంబు కోరి యిచ్చె
శివధనుర్భంగ విశేష కార్యము సల్పి
.......... జానకీప్రేమకాస్పదము జూపె
తండ్రియాజ్ఞానిబద్ధతజేత వనవాస
.......... మున ముని సన్నిభ మూర్తి యయ్యె

కపులుతో గూడి రాక్షస రిపుల జంపె
నిగమ వందిత భూజాత వగపు దీర్చె
పరమపదమైన భక్తిభావమ్ము నిచ్చె
మదిని సతతమ్ము నెలకొని ముదము గూర్చె.

Friday, 4 November 2016

పంకజ నేత్రుఁడై కదలి వచ్చెడు భక్తజనాళికంతకున్
శంకలు దీర్చి యైహిక విషంబుల ద్రుంచి విశుద్ధ భక్తిత
త్త్వాంకురమందజేసి యనయంబుగ బ్రహ్మ పదంబునిచ్చు యా  
శంకర పాదపద్మములు సన్నుతి జేతును భక్తి మీరఁగన్.