Tuesday, 31 January 2023

చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై

కల్ల యొకింత లేదు మరి గాంతుము గాదె కుచేలుడంత తా

మెల్లగ సంశయించుచు సమీపమునన్ నిలుచుండి భక్తిమై

గొల్లని చేతికింత యటుకుల్ దయసేయఁగ భూతి దక్కెనే  

చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై 

 

Monday, 23 January 2023

పలుకులు రాని వాఁడు పలుపాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

 భక్తరామదాసు గూర్చి...........................


కలియుగమందు మోక్షమును కల్గఁగజేసెడు భవ్యమైన యీ 

విలసిత రామనామమును వీడక నెమ్మదినిన్ జపించుచున్ 

పలువిధ భక్తి తత్త్వముల వర్ధిలుచున్ పొగడంగ రాజులన్ 

పలుకులు రాని వాఁడు పలుపాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

Thursday, 12 January 2023

కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

 నీమంబున్ ఘటియించి సత్పురుషసాన్నిధ్యంబునున్ జేరి ని

ర్వ్యామోహంబున కోరికల్ విడచి యీర్ష్యా రాగముల్ ద్రుంచుచున్

క్షేమంబిచ్చెడు పద్మనాభు పదముల్ సేవించు కైంకర్య స 

త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

Wednesday, 11 January 2023

బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్

మేలగు ధర్మవర్తన మమేయ తరప్రతిభావిశేషులున్

స్థూల నిరంతరాధ్యయన శోభిత సద్గుణ జ్ఞాన వారధుల్ 

ఖేలననొప్పి సత్కృషి లిఖించిన గాకయె యిట్లు యెవ్విధిన్ 

బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్ ?

Sunday, 8 January 2023

నేటి శంకరాభరణం సమస్య - కురు వంశంబున బుట్టి కీర్తి బడసెన్ కోదండరాముం డహో

 ఒక కుటుంబపెద్ద చాకలివాని మాటలను వారిస్తున్నట్లుగా..............


ధరణిన్ ధర్మము గావగా ధరణిజాధారుండునై బొల్చు, భీ

కర యుద్ధావని రావణాద్యసుర శిక్షాదక్షుఁడై నిల్చునా

పరమాత్మున్ పరిహాసమాడకుమిదే వాచాల! పాపంబు"మా 

కురు" - వంశంబున బుట్టి కీర్తి బడసెన్ కోదండరాముం డహో


నేటి శంకరాభరణం సమస్య - అన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్

 లక్ష్మణుడు విశ్వామిత్రునితో అంటున్నట్లుగా .................... 


వెన్నెల ఱేనిమోము యరవింద దళమ్ములనొప్పు కన్నులా

పన్నుల బ్రోచు హస్తము విపత్తుల ద్రుంచెడు సాహసమ్ములున్ 

మిన్నగు ధార్మికుండునెలమిన్ బ్రజలెల్లర రక్షకుండు మా

యన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్


Saturday, 7 January 2023

నేటి శంకరాభరణం సమస్య - సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

విద్యాప్రాభవ వైభవోజ్జ్వలిత సద్విజ్ఞాతు షట్చ్చాస్త్ర సం

వేద్యున్ దీర్ఘ బృహత్కవిత్వ రచనా మేధావినిన్ డించుచో

నుద్యుక్తంబగు పృచ్చకాళి గతినోహో! యీవధానీశ్వరున్

సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

Friday, 6 January 2023

నేటి శంకరాభరణం సమస్య- చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే

మురిపెములాడుచున్ కొడుకు ముద్దుగ వద్దకు చేరి తండ్రితో 

వెరపు నటించి బొమ్మలను వేడగ - దండగ యంచు బల్కి స

త్వరమె చలించి జాలివడి తా నెరవేర్చెను చిన్ని యాశలన్

చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే

Thursday, 5 January 2023

భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుం డహో

మూడవ అడుగు అనే నెపముతో తన పాదము మోపి శ్రీమహావిష్ణువు

బలిచక్రవర్తిని పాతాళమునకు ద్రోయు సన్నివేశము........


స్థిరతర చిత్తవృత్తినొక దీర్ఘతపంబొనరించి స్రష్టచే

వరముల నెల్ల గైకొని జవంబు బలంబు రహించి వెల్గగా 

సురగణమెల్ల భీతిలగ చోద్యముగా బలిచక్రవర్తి దం

భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుండహో


Wednesday, 4 January 2023

కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే

పూర్ణమనస్సరోజము  విభూతియె దానగుణంబు, ధీరుఁడై

యార్ణవ సన్నిభుండు బహుదంచిత ధైర్యపరాక్రమంబునన్ 

స్వర్ణపు కుండలంబొసఁగె భ్రాత్రుల చంపనటంచు బల్కెనే 

కర్ణుఁడు లోభియై మసలె ?  క్ష్మాపతులందున భీరువాతఁడే  ?

Tuesday, 3 January 2023

నేటి శంకరాభరణం సమస్య - కలకాలంబు శరీరముం డును తటిత్కల్పంబు సత్కీర్తియే

 రావణాసురుని యొక్క దేహము ఇప్పటికీ ధగ్ధమవుతూనే వుంటుందని ఒక కథ.... మండోదరి యొక్క వరము కారణంగా............


లలనన్ సీతను దొంగలించి కరుణా రాహిత్యమున్ మోహ సం

కెలలన్ చిక్కిన రావణుండు నదె నక్షీణాంబులన్ జచ్చె నా

వల మండోదరికై వరంబు ఫలమన్ భగ్నంబు కాకుండుటన్

కలకాలంబు శరీరముం డును తటిత్కల్పంబు సత్కీర్తియే

Monday, 2 January 2023

నేటి శంకరాభరణం సమస్య - పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే !!

మూఢుల యొక్క విధానము.......


సర్వమెఱుంగ మేమనుచు జ్ఞాన విదూర విమూఢభావనన్

నేర్వక యారు శాస్త్రములు నిశ్చయ పద్ధతి గాంచబోక గం

ధర్వుల దేవ దైత్యుల విధంబులెఱుంగక బోధజేయుచున్ 

పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు,  విజ్ఞులే??  

Sunday, 1 January 2023

నేటి శంకరాభరణం సమస్య........ ఆత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్

 ఆత్మనెఱుంగుటన్ననది యైహిక వాంచల మట్టుబెట్టి పూ

తాత్మను సంస్మరించుచు నహర్నిశలున్ పరమాత్మ జేరు ది

వ్యాత్ముల పాదయుగ్మపు మహత్తుల చింతనచేయుచుండు న

య్యాత్మలు పూన నూగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్


పూతాత్మా పరమాత్మాచా !!

గురువర్యులు శ్రీకంది శంకరయ్య గారికి, గురుతుల్యులు శ్రీ పోచిరాజువారికి మరియునితర కవిమిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర   ( 2023 ) శుభాకాంక్షలు.  


ఆంగ్లనూతన సంవత్సరాది మీకు

నిదె శుభాకాంక్షలందజేసెదను నేఁడు

శాంతి సౌఖ్యంబులంది నిశ్చింత నుండు 

భాగ్యమిమ్మమని వేఁడెద పరమశివుని