Wednesday, 30 November 2011

దత్తపది




ఈ రోజు మనము ఒక దత్తపది గురించి చూద్దాం.  దీనిని ఒకానొక పృఛ్ఛకుడు అవధాని బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారికి ఇచ్చినది.

దుష్టచతుష్టయమునుపయోగించి (దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ) రామాయణపరంగా పద్యాన్ని చెప్పమన్నారు.  మరి పద్యాన్ని అస్వాదిద్దామా.

దుర్యోధమీసైన్యమ
వార్యము దుశ్శాసనగత వక్రప్రతిభన్,
క్రౌర్యాంశకు నిజ ఫలమిది,
కార్యంబగు మంచివాని కర్ణము వడదే.  

చూశారా ఎంత అద్భుతంగా పూరించారో.  అవధాని గారికి నమస్సుమాంజలులు.

Saturday, 26 November 2011

సమస్యాపూరణము


క్రితంటపా లో చెప్పుకున్నట్టుగా సమస్యాపాదములో కొన్నిసార్లు ఎక్కువపదాలుకానీ లేదా తక్కువపదాలు కానీ ఇవ్వడమనేది అవధాని యొక్క ప్రజ్ఞకు,పాండిత్యానికి ఒక పరీక్షలాంటిది.  క్రింది సమస్యను చూడండి .

కపిన్ పూజలు చేసె రాముడు కపుల్ కనగా కపిలేని వేళలోన్. 

 అవధాని గారు కపిని వృషాకపిగా మార్చి సమస్యను పరిష్కరించారు.  "హరవిష్ణో వృషాకపి" అని అమరము.  వృషాకపి అంటే   విష్ణువు, ఈశ్వరుడు అని అర్థము.  మరి అవధాని గారియొక్క సమస్యాపూరణము చూసిన తరువాత ఇంత తేలికగా సమస్యలను పూరించవచ్చా అనే భావన కలుగుతుందనడములో సందేహము లేదు.      


ఈ జననంబు ధన్యమయి  హేమసువర్ణ విశీర్ణ పాత్రమై,
భ్రాజదనన్య రూప గుణరాఢ్య శిఖామణి దేవదేవతా
రాజిత పాదయుగ్మక నిరంతర పూజితు నావృషాకపిన్   
పూజలు చేసె రాముడు కపుల్ కనగా కపిలేని వేళలోన్. 

అవధాని మాడుగుల నాగఫణిశర్మ గారికి నా మన:పూర్వక శిరసాభివందనములు.

Wednesday, 19 October 2011

దత్తపది


దత్త పదిలోని మరియొక పూరణను చూద్దాం.

జయము, నయము, రయము, హయము పదములతో అవధానము విజయమును కాంక్షిస్తూ.........

జయము ఘటించుగాక మనసాశిరసా నుతియుంతుతల్లి ని
ర్ణయము ఫలించుగాక జననాంతర సత్కృత పుణ్యరాశియై  
రయము రహింపగా ద్విశతరమ్యవధానము వెల్గుగాక ఆ
హయముఖ దేవదివ్య కరుణామృతధార కవిత్వధారగాన్

అవధానిగారికి ( బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి ) శిరసాభివందనములు.                      

Wednesday, 12 October 2011

దత్త పది


కవి మిత్రులారా, ఒకానొక అవధానములో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి stop, listen, and, proceed  అనే పదాలను ఇచ్చి మహభారతములోని ఏదైన సన్నివేశాన్ని వర్ణించమని కోరినారు.  దాన్ని మరి మన అవధాని గారు పూరించిన విధమును చూడండి.                          

మహభారతములో, సకల ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని వర్ణిస్తున్నారీ పద్యములో.

ష్ఠాపూర్తిరిహాస్తుతే జనవరప్రౌఢప్రియంభావుక,
బ్రహ్మాణ్డస్తిరవర్ణనీయఘటనా వ్యాపారలీలాస్పద
కేళీ, జన్మ విహార ధారణకళా దివ్యప్రభావాంగహే
విప్రోసీఢ్య గుణార్ణవ స్తుతిపరా కాష్ఠస్తితేతేన్నమ:

అత్యత్భుతమైన పూరణ కదండీ.      

సుస్వాగతం


శ్రీ శారదాదేవి కరుణా కటాక్ష వీక్షణప్రాప్తులైన పండితోత్తములకు, కవిమిత్రులకు మరియు సాహిత్యాభిలాషులకందరికి సుస్వాగతనమస్సుమాంజలులను తెలియజేసుకొంటున్నాను.

తెలుగు సాహిత్యము మీద వున్న అమితమైన మక్కువ కారణముచేత, ఇతర గురువర్యుల, కవిమిత్రుల బ్లాగుల సందర్శనము వలన కలిగిన ప్రేరణ ఫలితమే ఈ పద్యరత్నాలు బ్లాగు.

నాకు ఈ ప్రేరణ కలిగించిన గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నా శిరసాభివందనములను తెలియజేసుకొంటున్నాను.

మా గురువర్యులు కంది శంకరయ్య గారు నిర్వహించే బ్లాగు ( శంకరాభరణం ) నుండి ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకొన్నాను.  అదే విధంగా ఈ బ్లాగునుండి ఒక్కరైన ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోగలిగితే, ఒక్కరికైన ఒక క్రొత్తవిషయాన్ని గాని, పద్యాన్ని కాని పరిచయము చేయగలిగెతే నా ఈ ప్రయత్నము సఫలమైనదనుకొంటాను.  

మీ అందరి ఆశీస్సుభాకాంక్షలే ఈ బ్లాగుకు ఊపిరి.

కృతజ్ఞతాభివందనములు.