Sunday, 6 November 2016

సరిలేని శస్త్రాస్త్ర చాపయుద్ధోద్ధతిన్
.......... ఋషియజ్ఞమును గాచె రిపులజంపి
కఠినశాపమున నిర్గమనయైన యహల్య
.......... కును నిజరూపంబు కోరి యిచ్చె
శివధనుర్భంగ విశేష కార్యము సల్పి
.......... జానకీప్రేమకాస్పదము జూపె
తండ్రియాజ్ఞానిబద్ధతజేత వనవాస
.......... మున ముని సన్నిభ మూర్తి యయ్యె

కపులుతో గూడి రాక్షస రిపుల జంపె
నిగమ వందిత భూజాత వగపు దీర్చె
పరమపదమైన భక్తిభావమ్ము నిచ్చె
మదిని సతతమ్ము నెలకొని ముదము గూర్చె.

Friday, 4 November 2016

పంకజ నేత్రుఁడై కదలి వచ్చెడు భక్తజనాళికంతకున్
శంకలు దీర్చి యైహిక విషంబుల ద్రుంచి విశుద్ధ భక్తిత
త్త్వాంకురమందజేసి యనయంబుగ బ్రహ్మ పదంబునిచ్చు యా  
శంకర పాదపద్మములు సన్నుతి జేతును భక్తి మీరఁగన్.

Sunday, 12 June 2016

శ్రీకృష్ణా నమోన్నమ:

నీ పాదంబులు జేరి గొల్చెదను మౌనివ్రాత సంస్తుత్య మా
పాపావేశ విచారభావనల బాపన్ మీ దయాదృష్టిచే
లోపంబెంచక నాదు భక్తిఫలమున్ లోకేశ! గైకొన్నచో
ప్రాపున్ జెంది తరింతు భక్తవరదా! పాహిప్రభో! యీశ్వరా!

Tuesday, 31 May 2016

శ్రీహనుమతే నమ:

గురువుగారికి మరియు కవిమిత్రులకు శ్రీహనుమత్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు.  

శ్రీమద్రామ పవిత్రపాదయుగ సంసేవాస్వభావుండునున్   
సోమస్తేజ విరాజితోత్తమ మహా శోభాయమానుండునున్
రోమాంఛత్కృత వీర్యధైర్య బలసంప్రోక్తుండునున్ నిత్యమున్
రామధ్యాన తపోనిధానుఁడగు నిన్ ప్రార్థించెదన్ మారుతీ.

Wednesday, 11 May 2016

గురుదేవులకు శ్రీ శంకరజయంతి పర్వదిన శుభాకాంక్షలు. 

అద్వైతామృత ధార బంచెను జగద్వ్యాప్తంబుగా ధీరుఁడై
విద్వత్ప్రౌఢిమఁ జూపుచున్ జనుల సద్విజ్ఞానమున్ బెంచుచున్
సద్వైరాగ్య విచారభావనల తేజ:పూర్ణుఁడై దివ్య మో 
క్ష ద్వారంబును జూపు "శంకరుల"కున్ కైమోడ్పులర్పించెదన్.    

Friday, 19 February 2016

కవిమిత్రులకు వందనములు. 
మొన్న తిరుపతి నుండి కడపకు పోవుచుండగా మధ్యలో పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట దేవస్థానము రాగా అప్పుడు వ్రాసిన పద్యము. 

శ్రీరఘురాము పాదములఁ చింతన జేయుదు సార హీన సం
సారవిచారభావనలు చాలని ప్రక్కకు నెట్టి మీ దయా
సారము నాకు చాలని యసంగతబుద్ధి విముక్తుఁడై మహో
దారగుణాభిరామ! శథతా నిను వేడెద మమ్ము గాచుమా!

శ్రీరామపట్టాభిషేక చిత్రపటము చూసి వ్రాసిన పద్యము................    

రాముని కన్న నెవ్వరు పరాక్రమశాలురు తేరిచూడ సం
గ్రామమునందు నుగ్రతర రాక్షసవీరుల సంహరించె ను
ద్ధామ గుణాభిరాముఁడు విధాతకుఁ బూర్వుఁడు భక్త బాందవ
శ్యాముఁడు మమ్ము కాచగ నసాధ్యందేది ఘటించునిద్ధరన్.