అవధానివారి దారిలోనే.........
క్షేమమొసంగునట్టిదగు శ్రేష్ఠకవిత్వ పదార్థజాలముల్
నీమముతోడ భక్తిమెయి నేర్పు రహించెడు ధోరణాకృతిన్
కామిత సత్ప్రదాయినిగ కావ్యములన్ విరచించి యాదిఁ శ్రీ
నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!!
అవధానివారి దారిలోనే.........
క్షేమమొసంగునట్టిదగు శ్రేష్ఠకవిత్వ పదార్థజాలముల్
నీమముతోడ భక్తిమెయి నేర్పు రహించెడు ధోరణాకృతిన్
కామిత సత్ప్రదాయినిగ కావ్యములన్ విరచించి యాదిఁ శ్రీ
నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!!
శతావధానములో ఆముదాల వారియొక్క ప్రతిభతో సభికులకు మోదము ( ముదము ) గల్గినదని ..........
ధీమహితాత్ముఁడై చెలఁగి దీర్ఘకవిత్వ పరంపరక్రియా
స్తోమ మహాహవాద్భుత యశోవిభవాత్ముఁడు నాముదాల వి
ద్యామహిమాన్వితుండునయి ధారణ ధారల తేలియాడుచో
నా ముద మెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్
శ్రీ ఆముదాల మురళి యవధానులవారికి నమస్సులతో..........
(తప్పులుంటే క్షమించమని )
అక్కట! యాంధ్రదేశ నివహంబుననా కుకవి క్రమంబునన్
లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె ? సద్వధానిగన్
మక్కువ జూపి సత్కవన మాధురులన్ పచరింపజేసి పెం
పెక్కిన ధారణాపటిమనెన్నగ మిన్నగ నున్నవారహో !
సూర్యాస్తమయములోపల సైంధవుని చంపుతానని ప్రతిన బూనిన అర్జునుని గెలిపించుటకై శ్రీకృష్నుడు సూర్యుని కిరణములను తన చక్రముచే గప్పుట..........
పరిణతి వీడి కౌరవులు పాండవమధ్యమపుత్రునంత సం
గరమున ధర్మదూరులయి కర్కశరీతిని సంహరించ భీ
కరగతి సైంధవున్ దునుమగా ప్రతినంబిడెనర్జునుండిదో
హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్
అర్జునుడి ప్రతాపము..........
వింత నకప్రయోగముల భీకర యుద్ధధురంధరుండునా
సాంతము వైరిరాజుల ప్రచండతరోగ్ర శిరోవిఖండితా
పంతము బూని విస్తృతవివర్ధిత దీర్ఘ శలాక జాలమౌ
బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో
సకల ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు సంధికొఱకై కౌరవ సభకేగిన - దుష్ట చతుష్టయము స్వామిని గేలిచేయు సందర్భము........
సాకల్యంబుగ సంధి కోరిన నిరాశా తాడితోన్మాదులై
ప్రాకట్యంబగు ధర్మ దిగ్విజయ సంభావ్యంబు ద్వేషించుచున్
శ్రీకృష్ణున్ సకలాఘ శోషణుని వంచింపంగ ధూషించిరే
కాకుల్ గర్జన సేయఁగా శునకముల్ గాండ్రించె నుగ్రమ్ముగన్
శ్రీశంకరాచార్యులు ఒక మూగవానికి మాటలు వచ్చేటట్లు చేసినాడని ప్రతీతి......
వివిధానేక విశిష్ఠ శాస్త్రతతులన్ విస్తారమున్ జేసి ప్రా
భవమద్వైత మహానిధానమున విద్వాంసాళినోడించె సం
స్తవనీయుండగు శంకరార్యులిదె శిష్యప్రేమఁ దీవించగా
చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
తమదగు రాజ్యమేలుటకు ధైర్యము సాహసముల్ ఘటించుచున్
సమరము జేయబూని యొక జట్టుగ జేరి సభాముఖంబునన్
సుముఖత తేటతెల్లముగ చొప్పిల జేయఁగ పర్వునంది యు
ద్యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో!
ఇమ్మహినాహవంబున మహేంద్రుని గెల్చిన వాడు వాడి బా
ణమ్మున మేఘనాథుఁడు రణమ్మున లక్ష్మణు మూర్చజేయ వే
గమ్ముననా హిమాలయ నిగమ్ముల గాలిచి యౌషధీయ గో
త్రమ్మును దెచ్చె మారుతియె రామునికై ముదమంద వానరుల్
కల్ల యొకింత లేదు మరి గాంతుము గాదె కుచేలుడంత తా
మెల్లగ సంశయించుచు సమీపమునన్ నిలుచుండి భక్తిమై
గొల్లని చేతికింత యటుకుల్ దయసేయఁగ భూతి దక్కెనే
చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
భక్తరామదాసు గూర్చి...........................
కలియుగమందు మోక్షమును కల్గఁగజేసెడు భవ్యమైన యీ
విలసిత రామనామమును వీడక నెమ్మదినిన్ జపించుచున్
పలువిధ భక్తి తత్త్వముల వర్ధిలుచున్ పొగడంగ రాజులన్
పలుకులు రాని వాఁడు పలుపాటలు పాడె జనమ్ము మెచ్చఁగా
నీమంబున్ ఘటియించి సత్పురుషసాన్నిధ్యంబునున్ జేరి ని
ర్వ్యామోహంబున కోరికల్ విడచి యీర్ష్యా రాగముల్ ద్రుంచుచున్
క్షేమంబిచ్చెడు పద్మనాభు పదముల్ సేవించు కైంకర్య స
త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
మేలగు ధర్మవర్తన మమేయ తరప్రతిభావిశేషులున్
స్థూల నిరంతరాధ్యయన శోభిత సద్గుణ జ్ఞాన వారధుల్
ఖేలననొప్పి సత్కృషి లిఖించిన గాకయె యిట్లు యెవ్విధిన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్ ?
ఒక కుటుంబపెద్ద చాకలివాని మాటలను వారిస్తున్నట్లుగా..............
ధరణిన్ ధర్మము గావగా ధరణిజాధారుండునై బొల్చు, భీ
కర యుద్ధావని రావణాద్యసుర శిక్షాదక్షుఁడై నిల్చునా
పరమాత్మున్ పరిహాసమాడకుమిదే వాచాల! పాపంబు"మా
కురు" - వంశంబున బుట్టి కీర్తి బడసెన్ కోదండరాముం డహో
లక్ష్మణుడు విశ్వామిత్రునితో అంటున్నట్లుగా ....................
వెన్నెల ఱేనిమోము యరవింద దళమ్ములనొప్పు కన్నులా
పన్నుల బ్రోచు హస్తము విపత్తుల ద్రుంచెడు సాహసమ్ములున్
మిన్నగు ధార్మికుండునెలమిన్ బ్రజలెల్లర రక్షకుండు మా
యన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్
విద్యాప్రాభవ వైభవోజ్జ్వలిత సద్విజ్ఞాతు షట్చ్చాస్త్ర సం
వేద్యున్ దీర్ఘ బృహత్కవిత్వ రచనా మేధావినిన్ డించుచో
నుద్యుక్తంబగు పృచ్చకాళి గతినోహో! యీవధానీశ్వరున్
సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్
మురిపెములాడుచున్ కొడుకు ముద్దుగ వద్దకు చేరి తండ్రితో
వెరపు నటించి బొమ్మలను వేడగ - దండగ యంచు బల్కి స
త్వరమె చలించి జాలివడి తా నెరవేర్చెను చిన్ని యాశలన్
చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే
మూడవ అడుగు అనే నెపముతో తన పాదము మోపి శ్రీమహావిష్ణువు
బలిచక్రవర్తిని పాతాళమునకు ద్రోయు సన్నివేశము........
స్థిరతర చిత్తవృత్తినొక దీర్ఘతపంబొనరించి స్రష్టచే
వరముల నెల్ల గైకొని జవంబు బలంబు రహించి వెల్గగా
సురగణమెల్ల భీతిలగ చోద్యముగా బలిచక్రవర్తి దం
భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుండహో
పూర్ణమనస్సరోజము విభూతియె దానగుణంబు, ధీరుఁడై
యార్ణవ సన్నిభుండు బహుదంచిత ధైర్యపరాక్రమంబునన్
స్వర్ణపు కుండలంబొసఁగె భ్రాత్రుల చంపనటంచు బల్కెనే
కర్ణుఁడు లోభియై మసలె ? క్ష్మాపతులందున భీరువాతఁడే ?
రావణాసురుని యొక్క దేహము ఇప్పటికీ ధగ్ధమవుతూనే వుంటుందని ఒక కథ.... మండోదరి యొక్క వరము కారణంగా............
లలనన్ సీతను దొంగలించి కరుణా రాహిత్యమున్ మోహ సం
కెలలన్ చిక్కిన రావణుండు నదె నక్షీణాంబులన్ జచ్చె నా
వల మండోదరికై వరంబు ఫలమన్ భగ్నంబు కాకుండుటన్
కలకాలంబు శరీరముం డును తటిత్కల్పంబు సత్కీర్తియే
మూఢుల యొక్క విధానము.......
సర్వమెఱుంగ మేమనుచు జ్ఞాన విదూర విమూఢభావనన్
నేర్వక యారు శాస్త్రములు నిశ్చయ పద్ధతి గాంచబోక గం
ధర్వుల దేవ దైత్యుల విధంబులెఱుంగక బోధజేయుచున్
పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు, విజ్ఞులే??
ఆత్మనెఱుంగుటన్ననది యైహిక వాంచల మట్టుబెట్టి పూ
తాత్మను సంస్మరించుచు నహర్నిశలున్ పరమాత్మ జేరు ది
వ్యాత్ముల పాదయుగ్మపు మహత్తుల చింతనచేయుచుండు న
య్యాత్మలు పూన నూగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్
పూతాత్మా పరమాత్మాచా !!